పాత్రలో ఇరుక్కున్న చిన్నారి తల.. ఊపిరాడక పసివాడి ఏడుపు.. చివరకు.. - సురక్షితంగా పసివాడి తల బయటకు తీసిన మెకానిక్
ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు తల ఓ అల్యూమినియం పాత్రలో ఇరుక్కుపోయింది. సమయానికి కుటుంబ సభ్యులు స్పందించడం వల్ల పసివాడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదాయులో జరిగింది.
ఇదీ కథ..
అలీ మొహమ్మద్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి హసన్‌పుర్ గ్రామంలో ఉంటున్నాడు. అతడికి ఏడాదిన్నర కుమారుడు ఉన్నాడు. శనివారం ఉదయం చిన్నారి ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో అతడి తల ఓ పాత్రలో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక పసివాడు బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు వెళ్లి చూడగా.. చిన్నారి తల పాత్రలో ఇరుక్కుపోవడం చూసి కంగుతిన్నారు. వెంటనే పసివాడి తల బయటకు తీయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఎంత సేపటికీ తల పాత్రలో నుంటి బయటకు రాకపోవడం వల్ల.. చిన్నారి తండ్రి అలీ మొహమ్మద్ దగ్గరలో ఉన్న వెల్డింగ్ మెకానిక్‌ను సంప్రదించారు. చిన్నారి తల బయటకు వచ్చే విధంగా మెకానిక్ కట్టర్‌తో పాత్రను కొద్దిగా కోశాడు. దీంతో పసివాడు సురక్షితంగా బయటపడడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.