Healthy Baby Show: తల్లి పాలే బిడ్డకు అమృతం, ఆహారం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి - కేంద్రమంత్రి కిషన్రెడ్డి తాజా వార్తలు
Healthy Baby Show Program: తల్లి పాలే బిడ్డకు వైద్యం, అమృతం, ఆహారం లాంటివని.. పిల్లల ఆరోగ్యమే తల్లులకు మహాభాగ్యమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. అంబర్‌పేట్ నియోజకవర్గంలోని బాగ్ అంబర్‌పేట్‌లో హెల్తీ బేబీ షో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలో హెల్తీ బేబీ షో కార్యక్రమం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారన్నారు. 3 నుంచి 13 నెలల పసిపిల్లలతో హెల్తీ బేబీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పిల్లలను తల్లులు ఎంతో పోటీ తత్వంతో పెంచుతున్నారని, ఇది చాలా మంచి పరిణామమన్నారు. కొందరు తల్లులు పిల్లలకు డబ్బా పాలు ఇస్తారని, అయితే తల్లి పాలే పిల్లలకు అమృతమన్నారు. తల్లి పాల వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం, సమాజం తరఫున తల్లిపాలను ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం తీసుకొచ్చామని తెలిపారు. హెల్తీ బేబీ షో సర్టిఫికెట్ పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా గుర్తుగా ఉంటుందని చెప్పారు. 'బేటీ బచావో.. బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా బాలికల ఆరోగ్యంతో పాటు భ్రూణ హత్యలను సైతం తగ్గించారని దీంతో నేడు దేశవ్యాప్తంగా మగపిల్లలతో పాటు ఆడపిల్లల సగటు పెరిగిందని అన్నారు.