వర్షాల్లో పనులు ఆపమని ఆదేశాలు.. పట్టించుకోని కాంట్రాక్టర్.. కుప్పకూలిన బ్రిడ్జ్
Under Construction Bridge Collapse : ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయిది. బ్రిడ్జ్ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన అధికారులు.. వంతెన కాంట్రాక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ జరిగింది.. ధమ్ధా మండలంలోని సిల్లి, నన్‌కట్టి గ్రామాలను కలిపేందుకు శివ్‌నాథ్ నదిపై సాగ్ని ఘాట్ వద్ద ఓ వంతెన నిర్మిస్తున్నారు. పిల్లర్లపై స్టేజింగ్, షట్టరింగ్ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొగ్రా రిజర్వాయర్ నిండగా.. శివ్‌నాథ్ నదిలోకి నీటిని విడుదల చేశారు. దీంతో నీటిమట్టం పెరిగి వంతెన కుప్పకూలి వరదలో కొట్టుకుపోయింది. బ్రిడ్జ్ కూలుతున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైళ్లలో బంధించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ కాగా.. అధికారులు స్పందించారు.
'వర్షాలు కురుస్తుండటం వల్ల రోడ్లు, వంతెనల పనులు ఆపమని ఆదేశాలిచ్చాం. కానీ వంతెన కాంట్రాక్టర్ పనులు కొనసాగించాడు. నీటి మట్టం పెరగడం వల్ల.. వంతెన కొట్టుకుపోయింది. దీనివల్ల రూ.12 లక్షల వరకు నష్టం వాటిల్లింది. దీనికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణం. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నాం' అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డీకే మహేశ్వరి తెలిపారు. రూ. 16.40 కోట్ల అంచనా వ్యయంతో 2020లో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. నవంబర్ 2022 నాటికే పనులు పూర్తి కావాల్సిన ఉంది. కానీ తాజా ఘటనతో బ్రిడ్జ్ పనులు మరింత జాప్యం కానున్నాయి.