Child Kidnap in Hyderabad: హైదరాబాద్‌లో పసికందు కిడ్నాప్.. వీడియో వైరల్ - Child Kidnap in Hyderabad
Child Kidnap in Hyderabad: అమ్మపొత్తిళ్లలో హాయిగా నిద్రపోవాల్సిన పసికందు క్షణంలో ఆ తల్లి ప్రేమకు దూరమైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆ పసికందును అపహరించి.. ఆ తల్లికి పుట్టెడు శోకాన్ని మిగిల్చారు. ఆ ఘటన హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లో చోటుచేసుకుంది.
కిడ్నాపునకు పాల్పడ్డ మహిళ, యువకుడికి సంబంధించిన దృశ్యాలు... సీసీ ఫుటేజ్‌లో లభ్యమయ్యాయి. అఫ్జల్ గంజ్‌లోని పుట్ పాత్ పై శిశువును... గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో కిడ్నాప్ చేసినట్లు దృశ్యాలను చూస్తే తెలుస్తుంది. తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాపునకు పాల్పడిన మహిళ వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అపహరణకు పాల్పడిన యువకుడి వయస్సు సుమారు 20 సంవత్సరాలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులు తెలుగు, ఉర్దూ మాట్లాడుతారని... ఫలక్ నుమా ప్రాంతవాసులని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తున్నట్లు.... పోలీసులు వెల్లడించారు.