Students Missing in Renjal : పదో తరగతి విద్యార్థినుల మిస్సింగ్.. ఇద్దరు యువకులపై కిడ్నాప్ కేసు - Nizamabad District News
Two Students Missing in Renjal mandal : రోజువారిలాగే ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయల్దేరిన విద్యార్థినులు.. అదృశ్యమైన ఘటన రెంజల్ మండలంలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని మోడల్ స్కూల్కు చెందిన ఇద్దరు అమ్మాయిలు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు బయలుదేరిన ఇద్దరు విద్యార్థినుల ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెంజల్ మండలం దుపల్లికి చెందిన ఇద్దరు అమ్మాయిలు మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నారు.
రోజువారి మాదిరిగానే పాఠశాలకు వెళ్లిన విద్యార్థినులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ మాత్రం అసలు ఆ విద్యార్థినులు పాఠశాలకే రాలేదని, తాము కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఘటనపై మిస్సింగ్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థినుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విద్యార్థినులు నిన్న ధూపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల ద్విచక్ర వాహనాలపై వెళ్లడాన్ని చూసిన స్థానికుల సమాచారం ఆధారంగా.. పోలీసులు వారిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.