TSRTC Electric Bus : ఆగస్టు నెలాఖరు నాటికి భాగ్యనగర రోడ్లపై మరో 25 ఈవీ బస్సుల రయ్.. రయ్.. ఈ విషయాలు తెలుసుకోండి
Electric Buses in Hyderabad : భాగ్యనగర రోడ్లపై త్వరలోనే ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఆగస్టు నెలాఖరు నాటికి 25 ఈవీ బస్సులను సిటీలో తిప్పనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. అందులో భాగంగా ఆర్డీనరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఏసీ బస్సులను తీసురాబోతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే త్వరలో రాణిగంజ్, హయత్‌నగర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ, కూకట్పల్లి డిపోల్లో విద్యుత్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గ్రేటర్‌లో ప్రస్తుతం 25 డిపోలు ఉండగా.. ఒక్కో డిపో సరాసరిగా 5,500ల లీటర్ల నుంచి 6,000 లీటర్ల వరకు డీజిల్‌ను వినియోగిస్తుందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తే డీజిల్ భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనాకు ముందు భాగ్యనగరంలో 3,800 ఆర్టీసీ బస్సులు ఉండగా.. తరువాత సుమారు 1000 బస్సులను తుక్కు కింద అధికారులు తొలగించారు. ప్రస్తుతం గ్రేటర్‌లో 2,800 బస్సులు ఉండగా.. రోజుకు 7.5 లక్షల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. నిత్యం 19 లక్షల ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి.