TSRTC Bandh in Telangana Today : రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన బస్సులు.. - TSRTC Latest News
TSRTC Bandh in Telangana Today for Two Hours : టీఎస్ఆర్టీసీ బిల్లును గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పెండింగ్‌లో ఉంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్ చేసేందుకు ఆర్టీసీ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో డిపోల వద్ద నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే బస్సులు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల ఆర్టీసీ బిల్లును తీసుకొచ్చింది. అయితే దీనిని రాజ్‌భవన్ పెండింగ్‌లోనే ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి.ఆర్టీసీఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు.. గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని పక్షంలో రాజ్‌భవన్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని తెలిపారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని.. న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని అందులో స్పష్టంచేశారు.