Kishan Reddy Comments on BRS : 'తెలంగాణలో బీఆర్ఎస్ను భర్తీ చేసేది బీజేపీ మాత్రమే' - వరంగల్‌ను సందర్శించనున్న మోదీ
Kishan Reddy About Modi Tour : 30 ఏళ్ల తర్వాత వరంగల్ నగరానికి తొలిసారిగా వస్తున్న దేశ ప్రధానికి పండుగ వాతావరణంలో స్వాగతం పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రేపు ప్రధాని మోదీ ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలన కోసం ఆయన నగరానికి వచ్చారు. ఇందులో భాగంగా తొలుత భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న కిషన్‌రెడ్డి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు.. అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రధాని ఆలయానికి వస్తారని కిషన్‌రెడ్డి తెలిపారు. అనంతరం, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీ మాత్రమే భర్తీ చేస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గతంలో కలిసి పని చేశాయని.. ఇప్పుడు కలిసి పని చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఫామ్‌హౌస్‌కే పరిమితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.