Komatireddy Venkatareddy : 'ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్.. లేదంటే రాజీనామాకు సిద్ధం' - Komatireddy Venkatareddy fires on KCR
TRT candidates meet With MP Komatireddy Venkatareddy : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఎవరు సీఎంగా ఉన్నా.. తమ మొదటి ప్రాధాన్యత విద్యపై ఉంటుందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగే ఈ నాలుగు నెలల్లో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ రాకపోతే వచ్చే కాంగ్రెస్ పాలనలో నెల రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను హామీ ఇచ్చినట్లు నోటిఫికేషన్ రాకపోతే తెలంగాణ కోసం రాజీనామా చేసినట్లే.. నిరుద్యోగుల కోసం మరోసారి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో టీఆర్‌టీ అభ్యర్థులు వెళ్లి కలిశారు. ఏళ్లు గడుస్తున్నా టీఆర్‌టీ చేపట్టడం లేదని అభ్యర్థులు ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి.. ఓట్ల కోసం స్కీముల పేరుతో మోసాలు చేస్తున్న కేసీఆర్‌కు నిరుద్యోగుల బాధలు పట్టవా..? అని ప్రశ్నించారు. తమ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద ధర్నా చేస్తామని పేర్కొన్నారు. 48గంటల దీక్ష చేసి నిరుద్యోగులకు అండగా ఉంటామని ఎంపీ స్పష్టం చేశారు.