బతికున్న చేపను మింగిన మహిళ.. చివరికి ఏమయిందంటే.! - tribal woman
పాపం చేపల వేటకు అని వెళ్లిన ఓ గిరిజన మహిళ.. చేపను పట్టి చంపుదామని నోటిలో వేసుకుంది. ఇంకేముంది కసుక్కున నోటిలోకి జారిపోయి గొంతులో ఇరుక్కుంది. బతికే ఉన్నా చేప నోటికి అడ్డం పడడంతో.. ఆమె ఊపిరి తీసేంత పని చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శివారు ప్రాంతం పొరుగు రాష్ట్రం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా కుంజవారిగూడెం గ్రామంలో ఈ విచిత్ర సంఘటన జరిగింది.
బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. కుంజవారిగూడెం గ్రామంలో నివసిస్తున్న గిరిజన మహిళ కుంజా సీత రాజుపేట కాలనీలో నివాసం ఉంటోంది. ఆదివాసీ గ్రామాల్లో గిరిజన మహిళలు, పురుషులు చిన్ననాటి నుంచి చెరువుకు వెళ్లి వారే స్వయంగా చేపలు పట్టుకొని వండుకుని తినే ఆచారం ఉంది. అదే క్రమంలో మంగళవారం మధ్యాహ్నం అక్కడే ఉన్న చెరువుకి తోటి గిరిజన మహిళలతో కలిసి సీత చేపలను పట్టడానికి వెళ్లింది.
చెరువులోకి దిగి చేపలు పడుతున్న క్రమంలో చేప దొరికింది. దానిని ఎలా చంపాలో అర్థం కాక నోటితో కొరికి చంపాలనుంది. బతికున్న చేప కావడంతో నోటిలో పెట్టగానే.. జారి గొంతులోకి వెళ్లిపోయింది. ఇంకేముంది గొంతుకు అడ్డంగా ఇరుక్కుపోయింది. తోటి గిరిజన మహిళలు ఎంత ప్రయత్నించినా నోటిలో ఉన్న చేప బయటకు రాకపోవడంతో.. ఆమె పరిస్థితి విషమంగా మారింది. దాంతో వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు అతి కష్టం మీద ఎంతో శ్రమించి.. గొంతులో ఇరుక్కున్న చేపను బయటకు తీసి ఆ మహిళ ప్రాణాలను కాపాడారు. ఆమె ప్రాణం నిలవడంతో.. అక్కడ ఉన్న గిరిజనులంతా ఊపిరి పీల్చుకున్నారు.