రీల్స్ చేయబోయాడు.. ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.. - train accident while making reels in hanumakonda
Train Accident Viral Video: సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎన్ని చూస్తున్నా.. అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇన్‌స్టా, మోజ్ వంటి వాటిల్లో లైకులు, ఫాలోవర్ల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ఇందుకోసం కొందరు ప్రాంక్ వీడియోల పేరిట జనాల ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు కదులుతున్న రైలు, బైకులపై సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హనుమకొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇలాంటి పనే చేసి ఆసుపత్రి పాలయ్యాడు. వడ్డేపల్లికి చెందిన అజయ్ అనే యువకుడు ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా ఖాజీపేట నుంచి బల్లార్ష వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్‌ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST