రెస్ట్ లేకుండా పనిచేస్తున్న 1,000 మంది.. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు సాగుతున్నాయిలా.. - ట్రాక్ పునరుద్ధరణ పనులు
Track Restoration Balasore : ఒడిశా బాలేశ్వర్‌లోని ప్రమాద స్థలంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతన్నాయి. సుమారు 1,000 మంది రైల్వే కార్మికులు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏడు పాకెటింగ్ యంత్రాలు, భారీ రైల్వే క్రేన్, నాలుగు రోడ్ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.05 గంటల నాటికి డౌన్ మెయిల్ లైన్‌ను పునరుద్ధరించారు. రైల్వే మంత్రి ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
శుక్రవారం సాయంత్రం నాటికి సహాయక చర్యలు పూర్తి కావడం వల్ల వెంటనే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు అధికారులు. శనివారం రాత్రి భారీ జనరేటర్లు, పెద్ద లైట్లను ఉపయోగించి ట్రాక్ లింకింగ్ పనులు చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో భారీగా లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేసి స్థానికులు అటువైపు రాకుండా సూచనలు చేస్తున్నారు. దీంతోపాటు రైల్వే పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించారు. ప్రమాదానికి గురైన 21 బోగీలను పట్టాలపై నుంచి తొలగించారు. గూడ్స్ రైలు బోగీల పైకి ఎక్కిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను తొలగించారు. మరోవైపు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రమాద స్థలిలోనే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. బుధవారం ఉదయం నాటికి ట్రాక్ పునరుద్ధరణ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మరో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో కలిసి వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద క్షతగాత్రులను ఆయన పరామర్శించారు.