టమాటాలకు కెమెరాతో భద్రత.. చోరీ భయంతో వ్యాపారి జాగ్రత్తలు - tomato price in bangalore
ఓ కూరగాయల వ్యాపారి మార్కెట్ ఆవరణలో బుట్టలో కెమెరా ఉంచి టమాటాలు విక్రయించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వింత సంఘటన కర్ణాటక హవేరిలో జరిగింది.
కర్ణాటక హనగల్ తాలుకా అక్కియాలుర్ గ్రామానికి చెందిన కృష్ణప్ప ఓ కూరగాయల వ్యాపారి. అతడు హవేరి మార్కెట్ ప్రాంగణంలో నిత్యం కూరగాయలు విక్రయిస్తాడు. అతడికి మార్కెట్లో శాశ్వతమైన దుకాణం కూడా లేదు. తను కూరగాయలు విక్రయించే స్థలంలో కెమెరాలు బిగించేందుకు అనువైన సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ టమాటా ధరలు పెరుగుతున్నందున.. కూరగాయల పెట్టెలోనే కెమెరా ఉంచి టమాటాలు విక్రయిస్తూ కృష్ణప్ప వార్తల్లోకెక్కాడు. టమాటాలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు కృష్ణప్ప ఆలోచన సరైనదేనని కొందరు అంటుంటే.. మరికొందరు తప్పుపడుతున్నారు.
మరోవైపు నిత్యం టమాటా రేట్లు పైపైకి ఎగబాకుతున్నాయి. గత కొద్ది రోజులుగా టమాటా కొనడం సామాన్యుడికి భారంగా మారుతోంది. అకాల వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని.. దిగుబడి తగ్గిపోవడం వల్ల టమాటా రేటు పెరిగిందని మార్కెట్లోని వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం హవేరి మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 150కు చేరింది.