Prathidwani On Telangana Formation : దశాబ్ది సంబురాల వేళ తెలంగాణ రాష్ట్రం ముందున్న లక్ష్యాలేంటి? - తెలంగాణ ఏర్పాటుపై ప్రతిధ్వని
Prathidwani On Telangana Formation : రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఈసారి ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని.. పదో ఏట అడుగు పెడుతుండటంతో తెలంగాణ ప్రగతిని చాటుతూ పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 21 రోజుల పాటు వేడుకలు జరపాలని.. జూన్ 2న ప్రారంభ వేడుకలను సచివాలయంలో నిర్వహించాలని నిర్ణయించారు. రోజుకు ఒక రంగం చొప్పున 21 రోజుల పాటు ఆయా రంగాల వారీగా తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని చాటేలా కార్యక్రమాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో పల్లె నుంచి పట్నం దాకా ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల ఉద్యమం సాగింది. వందలమంది లక్ష్య సాధనలో అశువులు బాసారు. అంతిమంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. సొంత రాష్ట్రాన్ని సాధించుకుని పదవ ఏట అడుగుపెడుతున్న నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రం ముస్తాబైంది. నాడు ఏ లక్ష్యాల కోసం తెలంగాణ ఉద్యమం సాగింది? వాటిని ఏ మేరకు సాధించారు? ఒకనాడు వెనుకబడ్డ తెలంగాణ ప్రాంతంగా పిలవడిన ఈ ప్రాంతం నేడు అభివృద్ధిపథంలో ఎలా సాగుతోంది? తెలంగాణ దశాబ్ది సంబురాల స్పూర్తి ఏంటనే అంశాలపై నేటి ప్రతిధ్వని.