Prathidwani : 111 జీవో రద్దు.. ఈ నిర్ణయంతో రాబోతున్న మార్పులు ఏమిటి? - హైదరాబాద్ వార్తలు
Prathidwani on 111 GO : కాలక్రమంలో జనాభా పెరగడం, నగరం విస్తరించడంతో పాలకులు ప్రత్యమ్నాయ మార్గాలు ఆలోచించారు. కృష్ణా, మంజీరా నదుల నుంచి తాగునీటిని సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లపై భారం తగ్గింది. కానీ, భవిష్యత్‌లో ఎదురయ్యే నీటి ఎద్దడిని తట్టుకోవాలంటే ఆ నిండుకుండలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గ్రహించింది. జలాశయాల ఎగువనున్న 84 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా సరే.. ఆ నీటి వనరులకు 10 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దనే.. కఠిన నిబంధనలతో జీవో 111 జారీ చేసింది. కొన్నాళ్లు బాగానే అమలైనా.. ఆ తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. 111 జీవో వల్ల తమ భూముల్లో ఏమీ చేసుకోలేకపోతున్నామనే ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరంలో ఎంతోకాలంగా కీలకమైన అంశంగా ఉన్న 111 జీవో విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ జీవోనూ పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటన వెలువరించింది. దీంతో 111 జీవో పరిధిలోకి వచ్చే 84 గ్రామాలకు హెచ్ఎండీఏ నిబంధనలనే వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరి ఈ నిర్ణయంతో రాబోతున్న మార్పులు ఏమిటి? ఆయా గ్రామాల్లో అభివృద్ధి సంగతి సరే.. జంట జలాశయాల పరిరక్షణ, పర్యావరణ పరమైన ఇష్యూస్‌పై ఎలాంటి జాగ్రత్తలు అవసరం? ఇదే అంశంపై నేటి ఈటీవీ భారత్ ప్రతిధ్వని.