'నిరంకుశ పాలనను అంతమొందించడానికే కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాం' - కాళేశ్వరంపై కోదండరాం వ్యాఖ్యలు
Published : Nov 5, 2023, 5:19 PM IST
TJS Prof Kodandaram on Their Support to Congress Party : కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కొట్టుకపోతుందో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అలాగే కొట్టుకపోతుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోదండరాం మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లలో కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.... ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.25 వేల కోట్లు గల్లంతయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు పనికిరాకుండా పోయాయన్నారు.
తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. రాజకీయాల అవసరాలను పక్కన పెట్టి నిర్ణయాన్ని తీసుకున్నామని.. అందుకే రాహుల్ గాంధీని కలిసినట్లు వివరించారు. తెలంగాణలో నిరంకుశ పాలనను అంతమొందిచేందుకు మీరు కదులుతున్నందున.. మీకు మేము మద్దతిస్తామని చెప్పినట్లు తెలిపారు. రాహుల్‌గాంధీ ముందు 6 అంశాల ఏజెండాను పెట్టామని.. వారు దానికి ఒప్పుకున్నారని కోదండరామ్ చెప్పారు. హుస్నాబాద్ నుంచి ఉద్యమకారుడు పొన్నం ప్రభాకర్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.