ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైంది : కోదండరాం - జగన్‌పై కోదండరాం ఫైర్
Published : Dec 1, 2023, 4:24 PM IST
TJS Chief Kodandaram on Congress Winning : తెలంగాణ రాష్ట్రం సిద్దించిన రోజున ఎంత ఆనందంగా ఉందో.. ఎన్నికల అనంతరం ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత అంతకు మించిన ఆనందం వేసిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తమ పార్టీ కార్యాలయంలో ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని మరోసారి నిరూపితమైందన్నారు. రెండుసార్లు పాలించిన బీఆర్ఎస్‌ను ఇంటికి పంపే ప్రక్రియలో సఫలీకృతులయ్యారని ఓటర్లకు అభినందనలు తెలిపారు.
అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా.. తెలంగాణ జన సమితి ప్రజాస్వామ్య పునరుద్ధరణకే కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం ఎప్పటికప్పుడు తమ గళమెత్తుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు పూనుకుంటామని హామీ ఇవ్వడంతో మద్దతు తెలిపామని చెప్పారు. మరోవైపు కృష్ణా జలాల వివాదంపై కేసీఆర్, జగన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని.. వాటి పట్ల అవగాహన ఉందని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్‌పై కేటీఆర్ ట్వీట్ పట్ల స్పందిస్తూ.. కేటీఆర్‌ది దింపుడు కళ్లెం ఆశేనని అన్నారు.