కాలువలో మందుపార్టీ.. ఒక్కసారిగా ఉప్పొంగిన వరద.. చివరికి.. - హరియాణా భివానీ క్రైమ్ న్యూస్
హరియాణా భివానీలో ఆసక్తికర ఘటన జరిగింది. మద్యం సేవించేందుకు ముగ్గురు యువకులు ఓ కాలువలో కూర్చోగా.. ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో యువకులు వరద నీటిలో కొట్టుకుపోయారు.
వేసవి కావడం వల్ల భివానీలోని జుయీ కాలువ పూర్తిగా ఎండిపోయింది. ఈ నేపథ్యంలో ముగ్గురు యువకులు.. మద్యం తాగుదామని కాలువ మధ్యలో కూర్చుకున్నారు. అయితే హఠాత్తుగా కాలువలో నీరు ఒక్కసారిగా ఉప్పొంగింది. దీంతో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు నదీ ప్రవాహంలో చిక్కుకున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కాపాడాలంటూ అరవడం మొదలు పెట్టారు.
ఈ సమయంలో అదే ప్రాంతంలో చెత్తను తొలగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు... వెంటనే సహాయం చేసేందుకు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న ఒకరిని చేతితో పట్టుకుని ఒడ్డుకు లాగారు. అలాగే మరో ఇద్దరిని కర్ర సాయంతో ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరుకున్న మందుబాబులు సరిగ్గా నడవలేకపోయారని.. తూలుతూ ఇంటికి చేరుకున్నారని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న యువకులను కాపాడిన వీడియోను ఓ పారిశుద్ధ్య కార్మికుడు తన మొబైల్ ఫోన్లో బంధించాడు.