CCTV Footage : గుడిలో దొంగతనానికి వచ్చి ప్రాణాలు కోల్పోయాడు - కుషాయిగూడ ఆలయంలో దొంగ మృతి
thief died in a temple while stealing hundi in Hyderabad: ఏదైనా పని చేయాలంటే అన్ని రకాలుగా కలిసి రావాలంటారు. కానీ ఓ దొంగకు మాత్రం కాలం కలిసిరాలేదు. కలిసి రాకపోగా చోరీ చేసేందుకు వెళ్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. దొంగతనం తన ప్రాణం మీదకు వస్తుందని ఆ దొంగ ఏ మాత్రం ఊహించి ఉండడు. ఊహించే ఉంటే ఆ పని చేసేవాడే కాదేమో. ఆలయంలో ఉన్న హుండీని దొంగిలించేందుకు వెళ్లిన ఓ దొంగ కాపలాదారుకు చిక్కి అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇదంతా గమనించిన ఓ దొంగ ఇందులో హుండీ ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుందని భావించినట్టున్నాడు. అందుకే నిన్న అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డాడు. ఆలయంలో ఉన్న దేవుడి ప్రతిమను ఎత్తుకెళ్లేందుకు మొదట ప్రయత్నించాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో అతడి చూపు హుండీపై పడింది.
ఇక అంతే హుండీ ఎత్తుకెళ్లడానికి శతవిధాలా ప్రయత్నించాడు ఆ హుండీ అక్కడి నేలకు అతుక్కుని ఉండటంతో ఎత్తుకెళ్లడం కష్టమైంది. అయినా సరే పట్టువదలకుండా హుండీని గట్టిగా లాగాడు. హుండీ చేతికైతే వచ్చింది కానీ ఆ శబ్ధానికి అక్కడే ఉన్న ఆలయ కాపలాదారు నిద్ర లేచాడు. దొంగ హుండీ ఎత్తుకెళ్లడం చూసి వెంటనే అప్రమత్తమయ్యాడు. అతణ్ని ఆపడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగ కాపలాదారుపై రాళ్లు విసిరాడు.
దొంగ నుంచి తప్పించుకోవడానికి.. హుండీ ఎత్తుకెళ్లకుండా అతడిని ఆపేందుకు కాపలాదారు దొంగను కర్రతో కొట్టాడు. గట్టిగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై దొంగ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దాంతో కాపలాదారు అక్కడి నుంచి పరారయ్యాడు. మరుసటి రోజు ఆలయానికి వచ్చిన అర్చకులు గుడిలో మృతదేహం చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని కాపలాదారుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలను పోలీసులు పరిశీలించారు.