Theft at Hyundai Showroom : రెచ్చిపోయిన ముసుగు దొంగలు.. వాహన షోరూమ్‌లలో చోరీ - Theft at Tata showroom in Nizamabad
Theft at Hyundai Showroom in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో ముసుగు దొంగలు హల్‌చల్ చేశారు. నిజామాబాద్ నాలుగో టౌన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో పాంగ్రా శివారులో గల వాహన షోరూంలలో దొంగలు ముసుగు ధరించి దొంగతనానికి పాల్పడ్డారు. వరుణ్, ప్రకాశ్ హ్యూందాయ్ షోరూంలోకి చొరబడ్డ దుండగులు.. లాకర్లు తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. పక్కనే ఉన్న టాటా షోరూంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి.. లక్ష రూపాయల వరకు దోచుకెళ్లారు.
యజమానుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగతనానికి పాల్పడిన వారు మహారాష్ట్ర ముఠాకు చెందిన వారని అనుమానిస్తున్నారు. సెక్యూరిటీ గార్డులు ఉండగానే వారి కళ్లుగప్పి నలుగురు ముసుగు దొంగలు వెనుక నుంచి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు గతంలో ముసుగు దొంగలు చోరీలకు పాల్పడిన కేసుల్లో ఇప్పటి వరకూ పురోగతి లేకపోవడంతో పోలీసుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.