మా బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారు? అప్పుల బాధతో సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం - బిల్లులు రావట్లేదని సర్పంచ్ దంపతుల ఆత్మహత్యాయత్నం
Sarpanchs Couple Attempt to Suicide in Nizamabad నిజామాబాద్ కలెక్టరేట్‌లో సర్పంచ్ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలంరేపింది. గ్రామంలో చేసిన పనులకు బిల్లులు రావటంలేదంటూ నందిపేట గ్రామ సర్పంచ్ వాణి, ఆమె భర్త తిరుపతితో కలిసి కలెక్టర్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆత్మహత్యాయత్నం చేశారు. ఆత్మహత్యకు యత్నించిన దంపతులను పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు.
గత పంచాయతీ ఎన్నికల్లో భాజపా మద్దతుతో గెలిచిన సర్పంచ్ వాణి... అనంతరం, అధికార పార్టీలో చేరారు. గ్రామంలో చేపట్టే పనుల కోసం రూ.2కోట్ల వరకు అప్పులు చేశామన్నారు. ఇప్పుడు ఆ అప్పులు వడ్డీలతో కలిపి రూ.4కోట్ల వరకు పెరిగిపోయినట్లు సర్పంచ్ దంపతులు వాపోయారు. తాము చేయించిన పనులకు సంబంధించిన బిల్లులు రాకుండా ఉపసర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం కోసం చేసిన అప్పులతో తాము బతకలేని పరిస్థితి నెలకొందంటూ సర్పంచ్ వాణి, ఆమె భర్త కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు యత్నించగా... పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు.