కేయూలో సభకు నిరాకరించిన వీసీ.. భగ్గుమన్న విద్యార్థి సంఘాలు
Kakatiya University students are protesting: కాకతీయ వర్సిటీలో విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు తలపెట్టిన సంఘర్షణ సభకు వీసీ అనుమతిని నిరాకరించారు. దీంతో విద్యార్థి సంఘ నాయకులు వర్సిటీలోని లైబ్రరీ వద్ద మహా ధర్నాకు దిగారు. కేయూ ప్రాంగణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాటలు జరిగాయి. ఆగ్రహం చెందిన విద్యార్థులు వర్సిటీ ప్రధాన గేటు వద్ద కిటికీలు, అక్కడే ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీసీ భవనం పైకెక్కి కొందరు విద్యార్థులు నిరసన తెలిపారు. గమనించిన పోలీసులు వీసీ భవనం పైకి ఎక్కిన వారిని కిందకు దించారు. అయితే కొంతమంది విద్యార్థులు పాటలతో తమ నిరసనను తెలియజేశారు.
అంతకముందు వారు టైర్లు కాల్చే యత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. వర్సిటీలో పరిపాలన భవనం ముందు ఆందోళన చేస్తున్న కొందరు విద్యార్థులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వీసీ, పాలకులకు తొత్తుగా వ్యవహారిస్తున్నారన్న విద్యార్థి సంఘ నాయకులు.. హైకోర్టు అనుమతితో సంఘర్షణ సభ నిర్వహించుకుంటామని తెలిపారు. ప్రస్తుతం వర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది.