bhatti vikramarka: పాదయాత్రలో ఉద్రిక్తత.. కార్యకర్తలపై భట్టి ఫైర్ - తెలంగాణ తాజా వార్తలు
bhatti vikramarka padayatra: జనగామ జిల్లా తరిగొప్పుల మండలం నాగారం వద్దకు చేరుకున్న సీఎల్పీ భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. భట్టికి స్వాగతం పలికేందుకు కొమ్మూరి, పొన్నాల వర్గీయులు పోటీపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట జరిగింది. పోటాపోటీగా నినాదాలు చేస్తూ.. ఆందోళనకు దిగిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు.
అంతకుముందు భట్టి విక్రమార్క చిల్పూర్ మండలం లింగంపల్లి గ్రామ ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళా ఆర్థిక సాధికారత కోసం డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించి.. ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి బిడ్డకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్యను అందిస్తామని భరోసాను కల్పించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ను ఎదురించి పోరాడే ధైర్యం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.