కర్ణాటక ఎన్నికల్లో బ్రహ్మానందం ప్రచారం.. ఎవరి కోసమో తెలుసా? - బ్రహ్మానందం బీజేపీ
తెలుగు చలనచిత్ర నటుడు బ్రహ్మానందం.. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ తరఫున ఆయన ప్రచారం చేశారు. కర్ణాటక చిక్కబళ్లాపుర అసెంబ్లీ నియోజకవర్గంలోని తెలుగు ప్రజలు అధికంగా ఉన్న వివిధ తాలుకాలలో ఆయన పర్యటించారు. తెలుగులో ప్రసంగించిన ఆయన.. సుధాకర్‌కు ఓటు వేసి గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు. మధ్యమధ్యలో జోకులు పేలుస్తూ స్థానికులను నవ్వించారు. తెలుగు ప్రజలతో పాటు స్థానికులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. మంత్రి సుధాకర్ తరఫున గత ఎన్నికల్లోనూ బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు.
కాగా, సుధాకర్‌కు మద్దతుగా ఇప్పటికే పలువురు కన్నడ సినీ ప్రముఖులు ప్రచార రథమెక్కారు. నటీనటులు సుధాకర్ తరఫున చిక్కబళ్లాపురలో ప్రచారం చేశారు. ఇంకొందరు సుధాకర్ ఇంటికి వెళ్లి తమ మద్దతును ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. జేడీఎస్ సైతం బలంగా ఉంది.