Telangana Weather Report: బంగాళాఖాతంలో తుపాను.. రాగల 3 రోజులు భారీ వర్షాలు!
Telangana Weather Report: వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను వల్లే నడి వేసవిలో అధిక వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. రాబోయే మూడు రోజుల పాటు ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఈరోజు ఈశాన్య, తూర్పులోని కొన్ని జిల్లాల్లో వడగళ్లతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. అదేవిధంగా రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని నాగరత్న పేర్కొన్నారు. ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి మరత్వాడా, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఒక ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతంలో సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వెల్లడించారు.