బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాష్ట్ర జన జాగృతి ఫోరం అధ్యక్షురాలు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 22, 2023, 9:09 PM IST
Telangana Jana Jagruthi Forum President joins in BRS : రాష్ట్ర జన జాగృతి ఫోరం అధ్యక్షురాలు కోటగిరి ఉషారాణి నిన్న కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ఆకర్షితురాలై బీఆర్ఎస్ పార్టీలో చేరానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని అన్నారు.
ఈ పథకాలు పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని కోటగిరి ఉషారాణి చెప్పారు. గత పది సంవత్సరాలలో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్ పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుకై ఎల్బీనగర్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలో తన కమిటీ సభ్యులంతా కారు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.