Group 4 Exam : కారేపల్లి స్టేషన్లో నిలిచిన రైలు.. ఆందోళనలో గ్రూప్-4 అభ్యర్థులు - Manuguru Super Fast Express delay
Manuguru Super Fast Express delay : ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వేస్టేషన్లో సాంకేతిక లోపంతో రెండు గంటలుగా మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అందులో ఇవాళ టీఎస్పీఎస్సీ గ్రూప్- 4 పరీక్ష రాసే అభ్యర్థులు ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరతామో లేదో అని ఆందోళన చెందారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా.. ఇంతలో రైలు బయలుదేరుతుందన్న సమాచారంతో అభ్యర్థులు మళ్లీ స్టేషన్కు చేరుకున్నారు. అభ్యర్థులందరూ కొత్తగూడెం పరిధిలోని పలు ప్రాంతాల్లో గ్రూప్- 4 పరీక్ష రాయాల్సి ఉంది.
గ్రూప్ -4 పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఉదయం 10గంటలకు ప్రారంభమై 12.30 గంటలకు ముగుస్తుంది. పేపర్-2.. 2.30 గంటల నుంచి 5 గంటల వరకు జరగనుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకుంటున్నారు. 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేశారు. మరోవైపు పరీక్షలు రాసే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో రైళ్లలో ప్రయాణించాల్సి వస్తోంది. కానీ రైళ్లు సరైన సమయానికి రాకపోవడం.. మధ్యలో అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం వల్ల కొన్నిసార్లు గమ్యస్థానాలకు చేరుకోవడం కష్టతరం అవుతోందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ దీనిపై స్పందించి రైళ్లను షెడ్యూల్ ప్రకారం నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.