రైతు బంధు, డీఏ చెల్లింపులకు సీఈసీ అనుమతి కోరిన సర్కార్ - Government employees DA News
Published : Nov 21, 2023, 11:29 AM IST
Telangana govt Request To CEC On Rythu bandhu : రైతుబంధు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపు విషయమై ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురు చూస్తోంది. వాటిపై వివరణలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా అనుమతి ఇవ్వలేదు. రుణమాఫీ మిగిలిన మొత్తం చెల్లింపు కోసం అనుమతి ఇవ్వాలని చాలా రోజుల క్రితమే కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసింది.. ప్రతిపాదనలు పంపింది. 2022 జులై ఒకటో తేదీ నుంచి మూడు డీఏలు ఇవ్వాల్సి ఉందని, ఒక డీఏ చెల్లింపునకు అనుమతి ఇవ్వాలని కోరింది.
రాష్ట్రంలో డీఏల చెల్లింపు విధానానికి సంబంధించిన వివరాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం.. ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం వెలువరించలేదని సమాచారం. అటు రెండో పంట పెట్టుబడి సాయం కోసం రైతుబంధు చెల్లింపు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. దానికి సంబంధించి కూడా ఈసీ కొన్ని వివరణలు కోరినట్లు సమాచారం. ఈ నెల 24 వ తేదీ నుంచి రైతుబంధు చెల్లింపులు చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదని చెప్తున్నారు.