Education Day celebrations in Telangana : 'త్వరలోనే డిజిటల్ తరగతి గదులు ప్రారంభిస్తాం' - విద్యా దినోత్సవం
Telangana Decade celebrations 2023 Today : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యా వేడుకలను పురస్కరించుకుని.. పాఠశాలలు నిర్వహించిన ర్యాలీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల "మన ఊరు- మన బడి" భవనాలు ప్రారంభించారు. అలాగే.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని విద్యాదినోత్సవంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్ల కాలంలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు.
1200కి పైగా గురుకులాలలో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం లక్ష 20 వేలు వెచ్చిస్తుందన్నారు. దేశమంతా తెలంగాణ వైపు చూసేలా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోందని.. త్వరలోనే డిజిటల్ తరగతి గదులు ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి పాఠశాలలో లైబ్రరీ కార్నర్ లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. చదువులో వెనుకబడిన వారి కోసం తొలిమెట్టు కార్యక్రమం సత్ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. అనంతరం పదో తరగతి ఫలితాల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించారు.