Telangana Decade Celebrations : భద్రాద్రి రాములోరి సన్నిధిలో ఘనంగా దశాబ్ది వేడుకలు
Telangana Decade Celebrations at Bhadradri Temple : స్వరాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని.. పదో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 2న ప్రారంభమైన ఈ వేడుకలు.. 21 రోజుల పాటు రోజుకో శాఖ తరఫున ఈ నెల 22 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రామయ్య సన్నిధిలోనూ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో ప్రతిరోజు ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేడు సీతారాముల ప్రచార రామ రథాన్ని పూలతో అలంకరించి ర్యాలీ నిర్వహించారు.
ప్రచార రథంతో ఆలయం నుంచి బయలుదేరిన ఆలయ అధికారులు, సిబ్బంది బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల ప్రచార రథంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో ప్రజలు సీతారాములను దర్శించుకొని కానుకలను సమర్పించుకున్నారు. రోజుకో నిర్దిష్ట కార్యక్రమంతో తొమ్మిది సంవత్సరాల్లో సాధించిన విజయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.