ఉపాధ్యాయులను అసెంబ్లీ ఎన్నికల విధుల నుంచి మినహాయించాలి : పీఆర్టీయూ - పింగలి శ్రీపాల్‌రెడ్డి
Published : Nov 7, 2023, 9:15 PM IST
Teachers Demand for Election Duty Exception:అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘం ఎన్నికల విధులపై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని.. తెలంగాణ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ టీఎస్) ఈసీని కోరింది. ఈ మేరకు హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను పీఆర్టీయూ టీఎస్ సంఘం నేతలు కలిసి వినితిపత్రం సమర్పించారు.
Duty Exception for Telangana Elections :శాసనసభ ఎన్నికల్లో గర్భిణీలు, మండల విద్యాధికారులు, వైకల్యం కలిగిన ఉపాధ్యాయులను విధుల నుంచి మినహాయించాలని పీఆర్టీయూ టీఎస్ సంఘం నేతలు కోరారు. వివిధ ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులను, ఉద్యోగ విరమణ చేసే వారిని కూడా మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాలకు వెళ్లే ఉపాధ్యాయులను కూడా విధుల నుంచి తప్పించాలని విన్నపించారు. చివరి శాసన సభ ఎన్నికల్లో ఎంఈఓలకు(మండల విద్యాధికారులు) ఆరోగ్య సమస్యలు ఉన్నా.. ఎన్నికల విధులకు హాజరయ్యారని చెప్పారు. ఉపాధ్యాయుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో తీసుకొని వారిని మినహాయించాలని ప్రొగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పింగలి శ్రీపాల్‌రెడ్డి కోరారు.