Mahanadu Breakfast Menu: మహానాడులో నోరూరించే రుచులు.. తిన్నారంటే వాహ్వా అనాల్సిందే..! - Mahanadu Menu
Mahanadu Breakfast Menu: రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మహానాడు తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో తూర్పుగోదావరి జిల్లాలోని వేమగిరిలో పండగ వాతావరణం కనిపిస్తోంది. మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన వేలాది మందికి నోరూరించే కమ్మనైన రుచులతో అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ శ్రేణుల కోసం ఇడ్లీ, పునుగు, కట్టె పొంగలి, మైసూర్ బజ్జీ, టమోటా బాత్ సిద్ధం చేశారు. టీ , కాఫీతో పాటు చిన్నారులకు పాలును కూడా అందుబాటులో ఉంచారు. మూడు ప్రాంతాలలో అల్పాహారం తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం.. అల్పాహారం ఇతర ఏర్పాట్లు పట్ల అమితమైన సంతోషం వ్యక్తం చేస్తున్నారు
నాలుగేళ్ల చిన్నోడు.. అదరగొట్టాడు:తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన చిరంజీవి, రేవతి దంపతుల నాలుగేళ్ల కుమారుడు తన ముద్దులొలికే మాటలతో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన పథకాలను.. వల్లె వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను గుక్క తిప్పుకోకుండా చెప్పాడు. తెలుగుదేశం మహానాడులో నేను సైతం అంటూ అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.