TDP Leader Nara Lokesh Emotional Speech: "ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాం".. టీడీపీ నేతల ముందు లోకేశ్ కంటతడి - Nara Lokesh comments
Published : Oct 21, 2023, 4:14 PM IST
TDP Leader Nara Lokesh Emotional Speech :ప్రజల కోసం అహర్నిశలు కష్టపడిన నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అని ప్రసగిస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఏపీలోని మంగళగిరిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశంలో లోకేశ్ ప్రసంగం గద్గద స్వరంతో సాగింది. తన తండ్రి చంద్రబాబు అరెస్టు, తరువాత పరిణామాలను గుర్తు చేసుకోని సమావేశ వేదికపైనే పార్టీ నేతల ముందు కంటతడి పెట్టుకున్నారు. తన తండ్రిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడమేగాక కుటుంబ సభ్యులపైనా వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసమే ఇవన్నీ భరిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు ఆడటం మా డీఎన్‌ఏలోనే లేవు : తన తల్లిపైనా కేసులు పెడతామని వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని.. తన తల్లి ఏనాడు ప్రభుత్వ కార్యక్రమాలకు రాలేదని గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సైకో జగన్, ఆయన సైన్యం ఆమెను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవా కార్యక్రమాలు తప్ప రాజకీయాలు తెలియవని.. గవర్నర్‌ను కలిసేందుకు కూడా వెళ్లలేదని అన్నారు. చంద్రబాబుకు పంపించే భోజనంలో విషం కలుపుతారని తమపై ఆరోపణలు చేస్తున్నారని.. భోజనాల్లో విషం కలపడం, కోడికత్తి డ్రామాలు ఆడటం తమ డీఎన్‌ఏలోనే లేవని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని లోకేశ్ వ్యాఖ్యానించారు.