చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ - ఫిబ్రవరి 12కు వాయిదా వేసిన సుప్రీం - స్కిల్ కేసు
Published : Jan 19, 2024, 5:21 PM IST
cbn bail in SC : స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలుకు చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే 4 వారాల సమయం కోరారు. విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేయాలని విన్నవించారు. ఫిబ్రవరి 9న తనకు మరో పని ఉందని ప్రభుత్వ న్యాయవాది రంజిత్‌కుమార్ చెప్పగా.... ఫిబ్రవరి 12న విచారణ చేయాలని హరీష్ సాల్వే విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 12వ తేదీకి వాయిదా వేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) అక్టోబర్ 31న మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలరీత్యా చికిత్స నిమిత్తం మధ్యంతర బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన షరతులపై హైకోర్టు నవంబర్ 20న స్పష్టత ఇచ్చింది. మధ్యంతర బెయిల్ షరతులు ఈ నెల28 వరకే వర్తిస్తాయని పేర్కొంటూ సాధారణ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు యథావిధిగా అన్ని కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని, రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.