Supreme Court Hearing on Chandrababu Case: చంద్రబాబు కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ - Siddhartha Luthra
Published : Sep 27, 2023, 10:03 AM IST
Supreme Court Hearing on Chandrababu Case: తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీ(SLP)పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని చంద్రబాబు సుప్రీంని ఆశ్రయించారు. ఆ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌ల నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఐటం 61 కింద ఈ కేసు లిస్ట్ అయింది. తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ గత శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ ముందు మెన్షన్ చేశారు. ఇందులో అత్యవసరత ఉన్నందున వెంటనే విచారణకు స్వీకరించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీజేఐ స్పందిస్తూ మంగళవారం రమ్మని చెప్పారు. అయితే మంగళవారం సీజేఐ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కూర్చోవడంతో ఈ కేసు ఆయన ముందుకు రాలేదు. అత్యవసర విచారణకు స్వీకరించాలని చంద్రబాబు న్యాయవాదులు ఇచ్చిన మెన్షనింగ్ స్లిప్‌ను పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఈ కేసును జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్‌ల ధర్మాసనం ముందు లిస్ట్ చేసినట్లు తెలిసింది.