సంక్రాంతి రోజున శివలింగాన్ని తాకి పరవశించిన సూర్య కిరణాలు
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా కర్ణాటక బెంగళూరులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గావి గాంధారేశ్వర మందిరంలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకి పరవశించాయి. గావిపురం గుహ మందిరంలోకి ప్రసరించిన సూర్యకిరణాలు గర్భగుడిలో వెలుగులు నింపాయి. ప్రతి సంక్రాంతికి గర్భగుడిలో కిరణాలు ప్రసరించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రతి ఏటా జరిగినట్లే ఈసారీ.. సూర్య కిరణాలు శివలింగాన్ని స్పృశించాయి. ఆదివారం సాయంత్రం 5.20 గంటల సమయంలో మూడు నిమిషాల 12 సెకన్ల పాటు సూర్య కిరణాలు శివలింగంపై ప్రసరించి కనువిందు చేశాయి. నంది కొమ్ముల మధ్య నుంచి ప్రసరించిన కిరణాలతో శివలింగం దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తజనం తరలివచ్చింది. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆకాశంలో మేఘాలు అధికంగా ఉండటం వల్ల 2021 ఏడాదిలో సూర్యకిరణాలు ప్రసరించలేదు.