Summer problems : దినకరా.. నీ ప్రభావం తగ్గించవయ్యా...! - తెలంగాణ తాజా వార్తలు
Summer Problems In Warangal : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఉదయం మండే ఎండలు సాయంత్రం వర్షాలు. ఎండవేడిమి భరించలేక ఉక్కపోతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వరంగల్ జిల్లాలలో గత మూడు రోజులు నుంచి ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. పనులన్ని ఉదయం 10 గంటలలోపే ముగించుకుని తిరిగి వెళ్లిపోతున్నారు. ఇక ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతలపానీయాలను సేవిస్తున్నారు. ఎండా కాలంలోనే దొరికే తాటి ముంజెలు కొనుగోలు కూడా అధికంగా ఉంటోంది. ఎండ తీవ్రతతో జనం బయటకి రాకపోవడంతో, గిరాకీలు ఉండట్లేదని ఆటోవాలాలు వాపోతున్నారు.
''మాములు రోజుల్లో ఆటో నడిపించి జీవితాన్ని గడపటమే చాలా కష్టం. ప్రజలు కూడా ఎండలకు బయపడి బయటికి రావటం లేదు. దీనివల్ల రోజువచ్చే కనీస డబ్బులు కూడా ఇప్పుడు రావడం లేదు. నెల వచ్చే సరికి కట్టే ఫైనాన్సులు, చిట్టీలు కట్టలేకపోతున్నాం.'' -నవీన్, ఆటోడ్రైవర్
''ఈ ఎండల్లో ఎటూ పోవాలన్న భయం అవుతుంది. ఏవైన పనులు ఉంటే ఉదయం 11 గంటలలోపే చేసుకుంటున్నాము. గత రెండు రోజులు నుంచి ఎండ తీవ్రత బాగా ఉంది''.-సాంబయ్య, స్థానికుడు