students crying headmistress suspension : ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్.. వెక్కి వెక్కి ఏడ్చిన విద్యార్థులు.. అప్పటివరకు స్కూల్కు వెళ్లమని.. - students crying for teacher transfer
Published : Oct 20, 2023, 1:36 PM IST
students crying headmistress suspension :వందలాది మందివిద్యార్థులు తమ ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్ అవ్వడం పట్ల తీవ్రంగా రోదించారు. ఆమెను కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మరో పక్క ఆమె వారిని సముదాయించే ప్రయత్నం చేసిన వారిని ఓదార్చలేకపోయారు. ప్రధానోపాధ్యాయురాలు పాఠశాల నుంచి వెళ్తుండగా.. వందలాది మంది విద్యార్థులు చుట్టుముట్టి వెళ్లవద్దని వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ అరుదైన సంఘటన ఉత్తర్ప్రదేశ్.. మథురలో జరిగింది.
ఏం జరిగిందంటే
కుసుమ లతా గౌతమ్ అనే మహిళ మథురలోని రహీంపుర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె విధి నిర్వాహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో కుసుమ లతను ప్రాథమిక విద్యాధికారి సస్పెండ్ చేసినట్లుగా సమాచారం. పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయురాలు వెళ్తున్నారని తెలుసుకున్న విద్యార్థులు ఆమెను చుట్టుముట్టారు. ఆమెను ఆలింగనం చేసుకుని రోదించారు. అలాగే కుసుమ లతపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమ ప్రధానోపాధ్యాయురాలు చాలా మంచి వారని.. అలాంటి ఆమెను నీచ రాజకీయాలకు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై సస్పెన్షన్ ఉపసంహరించుకునే వరకు పాఠశాలకు వెళ్లబోమని స్ఫష్టం చేశారు.