టీచర్ కోసం ఏడ్చిన విద్యార్థులు.. పాఠశాలకు తాళం.. 'అప్పుడే స్కూల్ తెరుస్తాం' అంటూ.. - టీచర్ బదిలీ స్కూల్‌కు తాళం వేసిన గ్రామస్థులు
Students Crying For Teacher Transfer : తమకు ఇష్టమైన ఉపాధ్యాయురాలు బదిలీ కావడం వల్ల విద్యార్థులు భావోద్వేగానికి గురయ్యారు. 'మమ్మల్ని వదలి వెళ్లొద్దు' అంటూ ఏడుస్తూ విన్నవించారు. గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేసి.. ఉపాధ్యాయురాలి బదిలీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. బదిలీ నిలిపివేసే వరకు పాఠశాల తెరవబోమని తేల్చి చెప్పారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది.. కుమట మండలంలోని ఉప్పినపట్నం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సంధ్యా రైకర్ అనే ఉపాధ్యాయురాలు 20 ఏళ్లుగా బోధిస్తున్నారు. ఈ 20 ఏళ్లలో ఆమెకు విద్యార్థులతో, గ్రామస్థులతో మంచి అనుబంధం ఏర్పడింది. తాజాగా ఆమెను భట్కల్ మండలంలోని మరో పాఠశాలకు బదిలీ చేశారు అధికారులు. దీంతో గ్రామస్థులు, విద్యార్థులు నిరాశకు గురయ్యారు. విద్యార్థులు భాగోద్వేగంతో ఏడ్చేశారు. 'మమ్మల్ని విడిచి వెళ్లొద్దు' అని విన్నవించారు. టీచర్ కూడా వారితో పాటే ఏడ్చారు.
ఉపాధ్యాయురాలి బదిలీని నిరసిస్తూ.. స్కూల్‌కు తాళం వేశారు గ్రామస్థులు. బదిలీని నిలిపివేయాలని విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. సంధ్య టీచర్‌ను మళ్లీ అదే పాఠశాలలో నియమించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అప్పటివరకు స్కూల్ తెరవబోమని తేల్చి చెప్పారు. ఈ ఘటనపై స్పందించిన స్థానిక నాయకుడొకరు.. అక్కడి ఎమ్మెల్యే దినకర శెట్టితో మాట్లాడి.. సంధ్య టీచర్‌ను ఆ పాఠశాలలోనే తిరిగి నియమించేటట్లు ప్రయత్నిస్తానని చెప్పారు.
'సార్'కు.. కన్నీటి వీడ్కోలు..
కర్ణాటకలోని గదగ్ జిల్లా ఖనతోటలోని బాలికల సీనియర్ ప్రాథమిక పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ బదిలీ అయినందుకు.. విద్యార్థినులు భాగోద్వేగానికి గురయ్యారు. గత ఏడాదిన్నర కాలంగా తమను ఎంతో ప్రేమగా చూసుకున్న ఉపాధ్యాయుడిని హత్తుకుని ఏడ్చేశారు. కన్నీటితో టీచర్‌కు వీడ్కోలు పలికారు. అవకాశం ఉంటే తాను తిరిగి అదే పాఠశాలకు వస్తానని టీచర్ చెప్పారు.