కొద్దిలో మరో ఘోరం తప్పింది.. బాలికను కరవబోయిన వీధి కుక్కలు - బాలికపై వీధి కుక్కలు దాడికి యత్నం
Street Dogs Attack Girl video recorded: హైదరాబాద్లో వీధి కుక్కల దాడిలో ఓ బాలుడు మరణించిన ఘటన మరువకముందే, అలాంటి తరహాలోనే మరోచోట ఓ బాలికపై వీధి కుక్కలు దాడి చేయడానికి ప్రయత్నించాయి. అక్కడే ఉన్న ఓ వ్యక్తి వాటిని తరిమి కొట్టడంతో బాలిక ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో.. 9 ఏళ్ల బాలిక(చిన్ని) పాలు తీసుకురావడానికి ఇంటి నుంచి షాపునకు వెళ్తున్న సమయంలో వీధి కుక్కలు దాడి చేశాయి.
బాలిక అరుస్తూ.. కింద పడడంతో కుక్కలు దాడికి యత్నించాయి. ఇది గమనించిన చేపూరి తిరుపతి అనే మోటార్ మెకానిక్ కుక్కలను తరిమి బాలికను కాపాడాడు. ఈ దృశ్యం అక్కడే ఫోటో స్టూడియో వద్ద ఉన్న సీసీ కెమెరాలో నమోదైంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలిక స్వల్ప గాయాలతో బయటపడింది. సీసీ కెమెరాలో కనిపిస్తున్న రెండు కుక్కలే కాకుండా, మరో నాలుగు కుక్కలు అటువైపుగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
సమయానికి స్పందించి బాలికను కాపాడిన తిరుపతిని స్థానికులు అభినందించారు. గత కొద్దిరోజుల నుండి కోహెడ మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామపంచాయతీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.