యడియూరప్ప ఇంటిపై రాళ్ల దాడి.. టైర్లకు నిప్పంటించి విసిరిన బంజారాలు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప ఇంటిపై ఆందోళనకారులు రాళ్ల దాడి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అంతర్గత రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరిగిందంటూ.. బంజారా ప్రజలు శివమొగ్గ జిల్లా శికారిపురలో ఉన్న యడియూరప్ప ఇంటిపై దాడి చేశారు. వందలాది మంది రాళ్లు, కర్రలను భవనంపైకి విసరడం వల్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కొందరు నిరసనకారులు.. టైర్లకు నిప్పంటించి ఇంటి ప్రాంగణంలోకి విసిరారు. సమీపంలో ఉన్న బీజేపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. కర్ణాటక ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. వెంటనే బారికేడ్లను ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. అయినా సరే కొందరు ఆందోళనకారులు ఆ బారికేడ్లను సైతం తొలగించి ముందుకు సాగారు. దీంతో పోలీసులు.. ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ సమయంలో చాలా మంది గాయపడ్డారు. ఎస్సీలకు అంతర్గత రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక మంత్రివర్గం గత వారం నిర్ణయించింది. అయితే బంజారా కమ్యూనిటీకి చెందిన వారికి తక్కువ రిజర్వేషన్లకు కల్పించారని ఆరోపిస్తూ వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టారు.