Sriram Sagar Project Water Level Increased : ఎస్సారెస్పీకి మళ్లీ మొదలైన వరద ప్రవాహం.. 4 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల - శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తివేత
Published : Sep 30, 2023, 4:46 PM IST
Sriram Sagar Project Water Level Increased : నిజామాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. వీటికితోడు ఎగువన కురుస్తోన్న వానలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద తిరిగి ప్రారంభమైంది. దీంతో అక్కడ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి 33,798 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్టు 4 గేట్లను ఎత్తివేశారు. ఈ గేట్ల ద్వారా 12,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఈ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువలోకి 2500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు ఎస్కెప్ గేట్ల ద్వారా 5,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూడు దారులలో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1,091 అడుగులుగా ఉంది. నీటి నిల్వ 90.313 టీఎంసీలుగా ఉంది.
మరోవైపు.. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జలాశయంలోకి సైతం ఎగువ నుంచి వరద నీరు వస్తుంది. ఎగువ నుంచి 6 వేల క్యూసెక్కుల నీరు రావడంతో రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1404.96 అడుగులుగా ఉంది.