Srinivas Goud Counter to Rahul Gandhi : కేసీఆర్‌ది కుటుంబ పాలన అంటున్నారు... మరి మీది ఏం అనాలి: శ్రీనివాస్ గౌడ్ - శ్రీనివాస్‌గౌడ్ రాహుల్‌గాంధీపై కామెంట్స్
Published : Oct 19, 2023, 4:53 PM IST
Minister Srinivas Goud Counter to Rahul Gandhi : రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. తెలంగాణలో కుటుంబ పాలన అంటున్న రాహుల్ గాంధీ.. మీది వారసత్వ రాజకీయాలు కావా అంటూ ప్రశ్నించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ దేశానికి ఏం చేసిందని అడిగారు. గుజరాత్ ఎన్నికల సమయంలో ఎందుకు ముఖం చాటేశారని నిలదీశారు. బీసీల గురించి మాట్లాడుతున్న మీరు.. మీ హయాంలో బీసీ సంక్షేమ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
కేసీఆర్ పథకాల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అలాంటి పథకాలు ఉన్నాయా.. ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. అవినీతి కుంభకోణాలకు చిరునామా కాంగ్రెస్ అని మంత్రి విమర్శించారు. మోదీ చేతిలో కాంగ్రెస్ నేతలు కీలు బొమ్మలని.. ఎక్కడ బోఫోర్స్ లాంటి కుంభకోణాలు మళ్లీ బయటికొస్తామోనని భయపడుతున్నారని.. అందుకే మోదీ ఎలా చెప్తే అలా రాహుల్ ఆడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ఖర్చే రూ.లక్ష కోట్లు.. అందులో అవినీతి జరిగిందని ఆరోపించడానికి అర్ధముందా అని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ వెళ్లిన రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రూ.200 పింఛను, 3 గంటల కరెంట్ మాత్రమే ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. రాష్ట్రంలో సంపద పెంచాలి.. పంచాలి అన్నది కేసీఆర్ నైజం.. దోచాలి అన్నది మీ విధానమని శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు.