దాల్ సరస్సులో భారీ అగ్నిప్రమాదం- ఐదు హౌస్బోట్లు, ఆరు ఇళ్లు దగ్ధం- ముగ్గురు మృతి - కాశ్మీర్ దాల్ సరస్సు హౌస్‌బోట్ అగ్నిప్రమాదం
Published : Nov 11, 2023, 5:08 PM IST
|Updated : Nov 11, 2023, 9:16 PM IST
Srinagar Dal Lake Fire Accident :జమ్ముకశ్మీర్.. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యటకులు మరణించారు. సరస్సులోని ఘాట్ నంబర్ 9 సమీపంలో శనివారం వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు హౌస్బోట్లు, ఏడు ఇళ్లు దగ్ధమయ్యాయి. సరస్సులో నిలిపి ఉంచిన సఫీనా హౌస్‌బోట్‌లో మంటలు చెలరేగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. కొన్నిగంటలపాటు సేపు శ్రమించి మంటలను అదుపు చేసినట్లు వెల్లడించారు.
మృతులను బంగ్లాదేశ్‌కు చెందిన కౌషల్, మహ్మద్ మొయినద్, దాస్ గుప్తాగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల సహకారంతో ఎనిమిది మందిని రక్షించినట్లు చెప్పారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. హీటర్ వల్లే హౌస్‌బోట్‌లో మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున 5.15 గంటల ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు వివరించారు.
అగ్నిప్రమాదంలో మరణించిన వారి పట్ల జమ్ముకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సంతాపం తెలిపారు. "శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మరణించిన వారి కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలుగా సాయం అందించాలని అధికారులను ఆదేశించాను" అని వెల్లడించారు.