'ఎగ్జిట్ పోల్స్‌కు ఎగ్జాట్ పోల్స్‌కు చాలా తేడా ఉంటుంది - 1000 శాతం అధికారం బీఆర్ఎస్దే' - ఎగ్జిట్ పోల్స్‌పై పోచారం కామెంట్స్
Published : Dec 2, 2023, 3:48 PM IST
Speaker Pocharam Srinivas Reddy On Winning : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 70 నుంచి 75 సీట్లు గెలిచి అధికారంలోకి వస్తుందని సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీఆర్ఎస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మూడోసారి సీఎం కాబోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 1000 శాతం బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్‌కు ఎగ్జాట్ పోల్స్‌కు చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చి, అభివృద్ధి చేసే ప్రభుత్వం వైపే ప్రజలు మొగ్గు చూపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీకి 10లోపే సీట్లు వస్తాయన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోతే అమలవుతున్న పథకాలన్నీ ఆగిపోతాయని పోచారం ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు అమలు చేయలేరని తెలిపారు. రాష్ట్రంలో పథకాలు అమలు కావొద్దని ఎవ్వరూ కోరుకోరని అన్నారు. ప్రజలు మూడోసారి బీఆర్ఎస్కు పట్టం కట్టబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యంత మెజారిటితో గెలుస్తామని తెలిపారు.