Somireddy Chandramohan Reddy Fires on YSRCP Government: స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపిస్తాం.. చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి - వైసీపీ నేతలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్
Published : Sep 13, 2023, 5:17 PM IST
Somireddy Chandramohan Reddy Fires on YSRCP Government: రాష్ట్రంలోని 40 స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో చేసిన ఖర్చు చూపేందుకు తాము సిద్ధమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అఖిలపక్షంతో కలిసి వైసీపీ నేతలు వస్తే, 40 కేంద్రాలు చూపిస్తాం.. 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చిన వివరాలతో పాటు.. ఉద్యోగాలు పొందిన 74 వేల మంది వివరాలు ఇస్తామన్నారు. నిజమో కాదో తేల్చుకుందాం రండి అంటూ సోమిరెడ్డి సవాల్ చేశారు. 40 కేంద్రాల ఏర్పాటు ఖర్చు నిజమైతే చంద్రబాబుకు నడిరోడ్డు మీద క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రూ. 371 కోట్లు చంద్రబాబు తినేస్తే.. కేంద్రాల ఏర్పాటు ఖర్చు మంత్రుల తాతల సొత్తు తెచ్చి పెట్టారా అంటూ మండిపడ్డారు.
డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వెల్కర్ రూ. 371 కోట్లు ఎక్కడ ఖర్చు చేశామో ఆధారాలు బయట పెట్టారన్నారు. ఇక అవినీతికి ఆస్కారం ఎక్కడిదని.. దీనిపై విచారించుకోవాలని కూడా వికాస్ సవాల్ చేశారన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉంటే జగన్ కంపెనీల్లోకి వేల కోట్ల నిధులు పారాయన్న సాక్ష్యం ఉందన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. జగన్ ఒక్క రూపాయి అయినా చంద్రబాబుకు వచ్చినట్లు చూపగలడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌లో అక్రమాలు జరిగాయని మాజీ సీఎంపై కేసు పెడతారా.. మరి బాధ్యులైన అధికారులను ప్రశ్నించరా అంటూ నిలదీశారు. జగన్ బూట్ల కింద సీఐడీ నలిగిపోతోందని.. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయని.. వైసీపీ నేతలు చూసుకోండని తెలిపారు. మంత్రులు ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల పాపాలు పండాయని.. అన్నీ అనుభవిస్తారని మండిపడ్డారు.