ఫినాయిల్ దాడితో మూర్ఛపోయిన నాగుపాము- ఆక్సిజన్ ఇచ్చి వైద్యుల ట్రీట్మెంట్ - స్పృహతప్పి పడిపోయిన పాముకు జీవం
Published : Nov 14, 2023, 4:51 PM IST
Snake Rescued Giving Oxygen Viral Video :స్పృహతప్పి పడిపోయిన నాగుపాముకు ఆక్సిజన్ అందించి కాపాడారు వైద్యులు. అనంతరం ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు స్నేక్ క్యాచర్. కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
అసలేమైందంటే?
రాయచూరు జిల్లా.. హట్టి చిన్నగాని గ్రామ శివారల్లోని ఓ ఇన్నోవా కారులో నాగుపాము ఉన్నట్లు హట్టీ గోల్డ్ మైనింగ్ కంపెనీ ఆస్పత్రి డాక్టర్ రబీంద్రనాధ్ గుర్తించారు. స్థానికులు ఆ పామును పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎలాగైనా పామును బయటకు రప్పించాలన్న ఉద్దేశంతో ఫినాయిల్ను పిచికారీ చేశారు. దాని వాసనకు నాగుపాము మూర్ఛపోయింది. వెంటనే స్నేక్ క్యాచర్ ఖలీద్ చావూస్ను రప్పించారు. అతడు నాగస్వరం ఊదినా, ఇంకెన్ని రకాలుగా ప్రయత్నించినా పాములో చలనం లేదు.
ఆ తర్వాత పామును స్థానిక ఆస్పత్రికి తరలించారు ఖలీద్ చావూస్. మనిషిలానే మంచంపై ఉంచి వైద్యులు.. చిన్న పైపు ద్వారా ఆక్సిజన్ అందించారు. దీంతో స్పృహ తప్పి పడిపోయిన నాగుపాము మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఆ తర్వాత స్థానికంగా ఉన్న అడవుల్లో సర్పాన్ని ఖలీద్ సురక్షితంగా విడిచిపెట్టాడు.