Snake In RTC Bus At Nirmal : బస్సులో బుసలు కొట్టిన పాము.. పరుగులు తీసిన ప్రయాణికులు - Telangana RTC Latest News
Snake In RTC Bus At Nirmal : రద్ధీగా ఉన్న ఆర్టీసీ బస్సు.. టికెట్లు ఇచ్చే పనిలో కండక్టర్, ప్రయాణికులను గమ్య స్థానాలకు క్షేమంగా తీసుకెళ్లాలని డ్రైవింగ్‌లో నిమగ్నమైన బస్సు డ్రైవర్. ప్రయాణికులు వారి కష్టసుఖాలను పంచుకుంటూ.. కిటికీలోంచి వచ్చిన చల్లగాలిని ఆస్వాదిస్తూ.. ప్రకృతిని అందాలను చూస్తూ సంతోషంగా గడుపుతున్నారు. ఇంతలో భారీ సర్పం వారి కళ్లెదుట దర్శన మిచ్చింది. ఇప్పుడు చెప్పండి వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో.. అలాంటి దృశ్యమే నిర్మల్ జిల్లా ఆర్టీసీ ప్రయాణికులకు కనిపించింది. జిల్లాలోని కుంటాల మండలం ఓల గ్రామం నుంచి నిర్మల్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ పాము బుసలు కొడుతు కనిపించింది. ప్రయాణికులు తెలిపిన వివరాలు ప్రకారం.. నర్సాపూర్ (జీ) గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులో రద్దీగా వెళ్తున్న బస్సులో వెనుక సీట్లలో పిల్లలు కూర్చున్నారు. ఇంతలో వారికి బస్సులో పాము కనిపించడంతో భయభ్రాంతులకు గురై కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశారు. ప్రయాణికుల హడావుడికి భయపడిన పాము ఒక్కసారిగా బస్సు కిటికీలోంచి బస్సుపై భాగానికి వెళ్లింది. బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు ధైర్యం చేసి పామును తరిమేశారు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.