పావురం గూడులో దూరిన నాగుపాము.. బుసలు కొడుతూ.. - cobra pigeon nest in karnataka
కర్ణాటక తుమకూరు జిల్లా తంగనహళ్లిలో ఓ నాగుపాము పావురం గూడులోకి దూరింది. ఓ ప్రైవేటు వ్యక్తికి చెందిన ఫాంహౌస్‌లోని గూడులో పాము కనిపించింది. సర్పాన్ని చూసిన ఫాంహౌస్ యజమాని హర్షవర్దన్ ఒక్కసారిగా భయపడ్డాడు. వెంటనే తుమకూరు వైల్డ్‌లైఫ్ రెప్టైల్స్ రెస్క్యూ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించాడు. సమచారం అందుకోగానే.. సరీసృపాల రెస్క్యూ నిపుణులు దిలీప్, గురుకిరణ్లు ఇద్దరు అక్కడకు చేరుకున్నారు. వారు చాకచక్యంగా వ్యవహరించి.. పావురం గూడులో ఉన్న పామును బయటకు తీశారు. రెస్క్యూ చేపట్టిన సమయంలో పాము బుసలు కొడుతూ కనిపించింది. నిపుణుడు దిలీప్ తన అనుభవంతో పాముతో జాగ్రత్తగా వ్యవహరించి సంచిలో వేసుకున్నాడు. అనంతరం పామును సమీపంలోని దేవరాయణదుర్గ అటవీలోకి వదిలి వేశాడు. కాగా పావురం గూడులో ఉన్న గుడ్లను తినేందుకు పాము వచ్చిందేమోనని నిపుణులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సాధారణంగా పాములకు తినడానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి ఇరుకైన గూళ్లలో దూరతాయని.. అందుకే పక్షులు పెంచుకునే వారు ఎప్పటికప్పుడు గూళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణుడు దిలీప్ తెలిపారు.