బెడ్రూంలోకి తాచుపాము.. నిద్రిస్తున్న యువకుడి పక్కకొచ్చి బుసలు - పాము వీడియోలు
Snake Enters Bedroom In Karnataka : ఓ తాచుపాము ఏకంగా బెడ్రూంలోకే ప్రవేశించింది. మంచమెక్కి బుసలు కొట్టింది. ఆ సమయంలో మంచంపైనే నిద్రిస్తున్న ప్రజ్వల్ అనే యువకుడు.. ఒక్కసారిగా పామును గుర్తించి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే బెడ్రూంలో నుంచి బయటకు పరుగులు తీశాడు. కొద్దిపాటులో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. హెబ్బల్లోని చెన్నమ్మ సర్కిల్లో ఉండే ఓ ఇంట్లోకి ఈ పాము ప్రవేశించింది.
కొద్దిసేపటి తరువాత షాక్ నుంచి తేరుకున్న ప్రజ్వల్ వెంటనే స్నేక్ క్యాచర్కు సమాచారం అందించాడు. అనంతరం స్నేక్ క్యాచర్ శ్యామ్.. అక్కడికి చేరుకున్నాడు. మంచంపై ఎంచక్కా సేదదీరుతున్న తాచుపామును సురక్షితంగా పట్టుకున్నాడు. పామును చాకచక్యంగా పట్టుకుంటున్న సన్నివేశాన్ని చుట్టుపక్కల వాళ్లు ఆసక్తిగా తిలకించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాము వచ్చి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పాము కనిపిస్తే దాన్ని చంపవద్దని.. వెంటనే స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలని శ్యామ్ కోరాడు. వాటిని తాము పట్టుకుని సురక్షితంగా అడవిలో విడిచిపెడతామని చెప్పాడు.